లాక్‌డౌన్‌లో.. ఇలా ఉల్లాసంగా, ఉత్సాహంగా.

కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలంతా దాదాపు నెలరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు..రోజూ కొద్దిపాటి వ్యాయామాలు తప్ప శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఇతరత్రా ఎలాంటి కార్యకలాపాలకు అవకాశం లేకుండా పోయింది..టీవీకి ఎన్ని గంటలు మాత్రం అతుక్కుపోతాం.మొత్తంగా ఇది క్లిష్టమైన తరుణం..ప్రతీ వ్యక్తిపై శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావం చూపడం ఖాయం..ఈ పరిస్థితులను అధిగమించి లాక్‌డౌన్‌లో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయాలంటున్నాడు భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌.

 హైదరాబాద్‌: ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ ఇది కష్టమైన సమయమే అంటున్న గోపీచంద్‌..ఈ పరిస్థితి మానసికంగా ఎంతో ప్రభావం చూపుతుందన్నాడు. అయితే సమస్య గురించి అతిగా ఆలోచించకుండా..దాని పరిష్కార మార్గాలను అనుసరించడమే ఉత్తమమని సూచించాడు. ‘గత 21 రోజులుగా నా కుటుంబంతో క్వారంటైన్‌లో ఉన్నా. ఇది కష్టమైనా తప్పని సందర్భం. రోజు కూలీలకు, చిన్న ఇంటిలో ఐదారుగురు నివసించేవారికి మరెంత కష్టమోకదా. కరోనా మహమ్మారిని పారదోలాలంటే ఇంటిపట్టున కూర్చోవాల్సిందే’ అని స్పష్టంచేశాడు. ఆటగాడిగా గాయాలవల్ల తాను నెలలపాటు మంచంపై ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘గతంలో నా మోకాలికి ఆపరేషన్‌ అయినప్పుడు మా కుటుంబం రాజేంద్రనగర్‌లోని ఓ ఇంట్లో రెండో అంతస్థులో ఉండేది. మెట్లు కుతుబ్‌మినార్‌ మెట్లలా ఇరుగ్గా ఉండేవి. దాంతో.. అప్పట్లో కాస్త లావుగా ఉండే నన్ను ప్రతి శుక్రవారం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎంతో అవస్థపడేవారు. అది నాకు ఎంతో కష్టంగా ఉండేది. అందువల్ల ప్రస్తుత లాక్‌డౌన్‌ నాకు భారంగా అనిపించడం లేదు’ అని అతడు వివరించాడు. 

ఆహార విషయంలో జాగ్రత్త..

క్రీడాకారులే కాదు సామాన్య ప్రజలు కూడా  శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఇలా చేయాలన్నాడు. ‘సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సాయంత్రం ఆరు గంటలకల్లా ఆహారం తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయం వరకు మరేమీ తీసుకోకూడదు. మనం తినే ఆహారం మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే పండు తింటే అది కడుపును శుభ్రం చేస్తుంది. కాలకృత్యాలు అయ్యాక 10 మీ. దూరం నడవాలి. అలాగే సూర్య నమస్కారాలతోపాటు ఐదు సెకన్లు స్పాట్‌ జాగింగ్‌ చేయాలి.  ఇలా రోజుకు కనీసం పదిసార్లయినా చేయాలి. ఇంకా..మీరు యాక్టివ్‌గా ఉంటే స్కిప్పింగ్‌ కూడా చేయొచ్చు’ అని గోపీ  వివరించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top