రైతు సెగ: ముందుకు సాగని రాజ్యసభ

న్యూఢిల్లీ: రైతు ఆందోళనల సెగ మంగళవారంనాడు రాజ్యసభను తాకింది. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది. తొలుత 10.30 గంటల వరకూ, ఆ తర్వాత 11.30 గంటలకు, తిరిగి 12.30 వరకూ సభను చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలకు సంబంధించి రైతు ఆందోళనలపై చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై చర్చించేందుకు విపక్షాలు ఇచ్చిన నోటీసును సభా చైర్మన్ తోసిపుచ్చారు. రైతు నిరసనలపై చర్చ ఇవాళ కాదని, బుధవారం ప్రారంభిద్దామని వెంకయ్యనాయుడు సభ్యులకు సూచించినప్పటికీ విపక్షాలు ఖాతరు చేయలేదు. తమ నోటీసులను తిరస్కరించినందుకు నిరసనగా సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. దీంతో సభను తొలుత 10.30 గంటల వరకూ వాయిదా వేసిన చైర్మన్, ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో 11.30 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ఇదే ఆందోళనలు పునరావృతం కావడంతో సభా కార్యక్రమాలు మధ్యాహ్నం 12.30 వరకూ వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలను సస్పెండ్ చేసి, రైతు ఆందోళనలపై చర్చ జరపాలంటూ 267 నిబంధన కింద పలువురు విపక్ష నేతలు నోటీసులు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top