రూ. 29 లక్షల జరిమానా మాఫీతో.. 16 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి స్వదేశానికి తెలుగోడు

హైదరాబాద్: ఉపాధి కోసం యూఏఈ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి 16 ఏళ్లుగా అక్కడే ఉండిపోయాడు. స్వదేశానికి తిరిగి రావాలని అనుకున్న తనపై ఉన్న రూ. 29 లక్షల జరిమానా చెల్లించే స్థోమత అతనికి లేదు. వీసా గడువు ముగిసి ఏళ్లుగా గడుస్తున్న అక్రమంగా ఆ దేశంలో ఉంటున్నందుకు అక్కడి సర్కార్ విధించిన జరిమానా ఇది. చివరకు అతని పరిస్థితి గురించి తెలుసుకున్న సామాజిక కార్యకర్త ఒకరు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌తో సంప్రదించి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల ద్వారా అతడ్ని స్వదేశానికి పంపించారు. అంతేగాక దుబాయ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన భారత కాన్సులేట్ అతనిపై ఉన్న రూ. 29 లక్షల జరిమానాను కూడా మాఫీ చేయించింది. దీంతో 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత మంగళవారం స్వదేశానికి చేరుకున్న అతను తన కుటుంబ సభ్యులను కలుసుకుని ఆనందం వ్యక్తం చేశాడు. 

వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా చింతమన్‌పల్లికి చెందిన నీలా ఎల్లయ్య(48) ఉపాధి కోసం 2004లో యూఏఈ వెళ్లాడు. అక్కడ ఓ భవన నిర్మాణ సంస్థలో లేబర్‌గా చేరాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పనిని వదిలేశాడు. అప్పటి నుంచి వేరే పనులు చేసుకుంటూ గత 16 ఏళ్లుగా దుబాయ్, షార్జాలో ఉంటున్నాడు. ఎల్లయ్య వీసా గడువు ఎప్పుడో ముగిసిపోయింది. అయినా అక్రమంగా 16 ఏళ్లుగా అక్కడే ఉండిపోయాడు. కాగా, యూఏఈ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీసా గడువు ముగిసి తమ దేశంలో అక్రమంగా ఉండేవారికి రోజుకీ 25 దిర్హామ్స్(రూ. 500) జరిమానా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 16 ఏళ్లకు గాను ఎల్లయ్య 1.46 లక్షల దిర్హామ్స్(సుమారు రూ. 29 లక్షలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇంత భారీ మొత్తం చెల్లించే స్థోమత ఆయనకు లేదు. 

ఇక ఎల్లయ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ‘జైన్ సేవ మిషన్'(జేఎస్ఎం) స్వచ్ఛంద సంస్థ సభ్యుడు రూపేష్ మెహతా ఈ విషయాన్ని దుబాయ్‌లోని భారత కాన్సులేట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దుబాయ్ అధికారులతో కాన్సులేట్ సంప్రదింపులు జరిపింది. అధికారులకు అతని పరిస్థితిని వివరించారు. దాంతో దుబాయ్ ప్రభుత్వం ఎల్లయ్యపై ఉన్న రూ. 29 లక్షల జరిమానాను మాఫీ చేసింది. అలాగే దేశం నుంచి వెళ్లేందుకు అనుమతి కూడా మంజూరు చేసింది. దాంతో కాన్సులేట్ కార్యాలయం అతని పేరిట అత్యావసర ధృవపత్రాలు రెడీ చేయడంతో పాటు దుబాయ్ నుంచి హైద్రాబాద్‌కు ఉచిత విమాన టికెట్ ఏర్పాటు చేసింది. దీంతో ఎల్లయ్య మంగళవారం హైద్రాబాద్ విమానశ్రయానికి చేరుకున్నాడు. ఇక అతని కోసం ఎయిర్‌పోర్టుకు వచ్చిన భార్య రాజవ్వ, ఇతర కుటుంబ సభ్యులను చూసిన ఎల్లయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. స్వదేశానికి రావడంలో తనకు సహకరించిన ఇండియన్ కాన్సులేట్, జేఎస్ఎం స్వచ్ఛంద సంస్థ సభ్యుడు రూపేష్ మెహతా, దుబాయ్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top