న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల పెరుగుదల శాతం రోజు రోజుకీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 24 గంటల్లో 2,411 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. మన దేశంలో ఒకే రోజులో ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 37,776కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 71 మంది చనిపోయారట. దీంతో నేటి వరకు కరోనా వల్ల మరణించిన భారతీయుల సంఖ్య 1,223కు చేరింది. అలాగే కరోనా బారిన పడి కోలుకున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. నేటి వరకు 10,018 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని బయట పడ్డారని ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.
రెండు దఫాలు పూర్తి స్థాయి లాక్డౌన్ కొనసాగించిన అనంతరం.. మూడో ధఫాలో కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో సడలించారు. దేశంలోని అన్ని జిల్లాలను ఎరుపు, కాషాయం, ఆకుపచ్చ జోన్లుగా విడదీసి లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 83 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇన్ని రోజులు ఉన్న ఆంక్షలే మే 17 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ఆరెంజ్ జోన్లలో కొద్ది పాటి సడలింపులు.. గ్రీన్ జోన్లలో మరిన్ని ఎక్కువ సడలింపులు చేస్తున్నట్లు చెప్పారు.