న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు విరుచుకుపడ్డారు. బ్యాంకు కుంభకోణాల్లో ఉన్నది బీజేపీ స్నేహితులేనని ఆరోపించారు. భారతీయ బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విడుదల చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. బ్యాంకు కుంభకోణాల్లో ‘బీజేపీ స్నేహితులు’ ఉండబట్టే బీజేపీ ప్రభుత్వం ఈ జాబితాను పార్లమెంటు నుంచి దాచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పార్లమెంటులో నేను ఒక అతి సాధారణ ప్రశ్న అడిగాను. అతిపెద్ద బ్యాంకు కుంభకోణాలకు పాల్పడిన 50 మంది పేర్లు చెప్పమని. నా ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. ఇప్పుడు ఆర్బీఐ నీరవ్ మోదీ, మొహెల్ చోక్సీ సహా ఇతర బీజేపీ స్నేహితుల పేర్లను ఆ జాబితాలో చేర్చింది. అందుకే ఈ నిజాన్ని పార్లమెంటులో దాచిపెట్టారు’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేస్తూ ఓ వీడియోను జతపరిచారు.
కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆర్బీఐ టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందించింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ ఆరోపణలు చేశారు. నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా సహా 50 మంది ఎగవేతదారుల రుణాలు రూ.68,607 కోట్లను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 నుంచి సెప్టెంబరు 2019 వరకు ప్రభుత్వం మొత్తం 6.66 లక్షల కోట్లను మాఫీ చేసిందని పేర్కొంది.