బద్ధ విరోధులైన నక్సలైట్లకు రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు

న్యూఢిల్లీ : ఇద్దరూ బద్ధ విరోధులు…. ఒకరికి ఒకరు ఎదురుపడితే కాల్పుల మోతలే. ఒక్క నిమిషమూ ఆలోచించరు. వారు వీరి కోసం వెతుకుతారు… వీరు వారి కోసం వెతుకుతారు. వారి కంట కనబడకుండా దెబ్బ తీయాలని వారు ప్రయత్నిస్తారు…. వీరూ అంతే దెబ్బతీసి పై చేయి సాధించాలని కసితో రగిలిపోతారు. ఒకరు సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా…. మరొకరు నక్సలైట్లు. వీరిద్దరి మధ్యా శత్రుత్వం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ శుక్రవారం ఓ విచిత్ర సంఘటన జరిగింది.

జార్ఖండ్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు నక్సలైట్లకు రక్తదానం చేశారు. ఇది కేవలం మానవత్వంతో వారి ప్రాణాలను కాపాడడానికే ఇలా చేశారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు, నక్సలైట్లకు మధ్య శుక్రవారం జార్ఖండ్‌లో భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. అందులో ముగ్గురు మావోయిస్టులను జవాన్లు ఎన్‌కౌంటర్ చేయగా, ఇద్దర్ని అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ఆ నక్సలైట్లను జవాన్లు టాటానగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లైన ఓం ప్రకాశ్ యాదవ్, సందీప్ కుమార్ ఇద్దరూ నక్సలైట్లకు రక్తదానం చేశారు. నక్సలైట్ల పరిస్థితి బాగోలేదని వైద్యులు పేర్కొనడంతో వీరు రక్తదానం చేశారు. ‘‘మా సీఆర్పీఎఫ్ జవాన్లకు వ్యతిరేకంగా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తారనీ తెలుసు. తామూ వారికి వ్యతిరేకంగా యుద్ధ తంత్రాలు చేస్తామనీ తెలుసు. వీటన్నింటి కంటే మీద మానవత్వం అంటూ ఒకటుంటుంది కదా. ఓ మానవత్వం ఉన్న మనిషిగా నా బాధ్యత నేను నిర్వర్తించా’’ అని సీఆర్పీఎఫ్ జవాన్ ఓం ప్రకాశ్ పేర్కొన్నారు. దేశాన్ని రక్షించే కర్తవ్యంలో భాగంగా శత్రువుపై తాము కాల్పులు జరుపుతామని, అయితే వారి ప్రాణాలను కూడా తాము కాపాడతామని సీఆర్పీఎఫ్ జవాన్లు పేర్కొనడం విశేషం. ఇద్దరు నక్సలైట్లకు తమ సీఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేయడం తాము ఎంతో గర్వంగా భావిస్తామని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top