బదిలీలు, పదోన్నతులు చేపట్టండి

సాధారణ, అంతర్‌ జిల్లా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని.. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్లతో నెల రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎ్‌సపీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి భారీగా టీచర్లు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డి, రాంచందర్‌ రావులతో పాటు ప్రొఫెసర్‌ కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొని పోరాటానికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తన శాఖ పరిధిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టేలా అధికారాలను వినియోగించుకునేందుకు విద్యాశాఖ మంత్రికి స్వేచ్ఛ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ పేరుతో పాఠశాలలను తెరవకుండా ప్రభుత్వం పిల్లలకు నష్టం చేస్తోందని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డిని భర్తరఫ్‌ చేసి జైలులో పెట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నకిలీ లేఖలతో న్యాక్‌ గుర్తింపు కోసం ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో మాట్లాడి సీపీఎస్‌ రద్దుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. 3 నెలల్లో ఇస్తానన్న పీఆర్సీ 30 నెలలుగా ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రశ్నించారు. 25వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, టీచర్ల సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్‌ ముట్టడికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని ఆర్‌. కృష్ణయ్య ఆరోపించారు. టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, సీపీఎ్‌సను రద్దు చేసి, ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, మహాధర్నాలో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ చక్రధర్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top