న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చిచూస్తే కరోనా మహమ్మారి ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బ్లూమ్‌బర్గ్ కరోనా వైరస్ ట్రాకర్ తెలిపిన గణాంకాల ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి మునుపటి వారంతో పోలిస్తే 20 శాతం మేరకు పెరిగింది. మొత్తం కరోనా కేసుల విషయానికొస్తే అమెరికా, బ్రెజిల్ కంటే భారత్ వెనుకబడి ఉంది. భారత్, బ్రెజిల్‌లలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. భారత్‌లో ప్రతీ వెయ్యి మందిలో 11.8 శాతం, బ్రెజిల్లో 11.93 శాతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని ప్రతీ వెయ్యి మందిలో 152.98 శాతం, రష్యాలో 184.34 శాతం పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం వరుసగా ఆరోరోజు దేశంలో కొత్తగా 45 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 47,704. ఇదేసమయంలో 654 మంది కరోనాతో మృతిచెందారు. 35,176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత ఐదు రోజులలో కరోనాను ఓడించిన వారి సంఖ్య 30 వేలను మించడం విశేషం. అలాగే రికవరీ రేటు 64.23 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 2.25 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో అత్యధిక కరోనా కేసులు ఉన్నాయి.