నేటి నుంచి బంగారం బాండ్ల జారీ

గ్రాము ధర రూ.4,639 

<

ముంబై: ప్రభుత్వ పసిడి బాండ్ల దరఖాస్తు ప్రక్రియ సోమవారం (20 వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ 24వ తేదీన ముగియనుంది. ఈ సారి బాండ్ల యూనిట్‌ (గ్రాము) ధరను రూ.4,639గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇదే తొలి విడత బాండ్ల జారీ. ఏప్రిల్‌- సెప్టెంబరు మధ్యలో ఆరు విడతల్లో గోల్డ్‌ బాండ్లను జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతోపాటు ఆ అప్లికేషన్‌పై డిజిటల్‌ మార్గంలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అంటే, వారికి గ్రాము రూ.4,589కే లభిస్తుంది. బంగారు బాండ్‌ యూనిట్‌ ఒక గ్రాముతో సమానం.

ఈ పథకంలో కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) 4 కేజీల  వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీ సంస్థలు 20 కిలోల వరకు కొనేందుకు వీలుంటుంది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక పెట్టుబడులను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top