దేశంలో కరోనా కేసులు 694

  • 16కు పెరిగిన మృతుల సంఖ్య 
  • కేసుల పెరుగుదల పెద్దగా లేదు
  • వైరస్‌ వ్యాప్తి రెండో దశలోనే…
  • కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 26: ‘‘దేశంలో కరోనా వైరస్‌ కేసులు 694కు పెరిగాయి. కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 16కు పెరిగింది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో కేసుల పెరుగుదల పెద్దగా లేదని తెలిపింది. కరోనా వ్యాప్తి రెండో దశలోనే ఉందని, సామాజిక వ్యాప్తి లేదని ప్రజలకు భరోసా ఇచ్చింది. రాజస్థాన్‌లోని భీల్వాడాలో మధుమేహం, కిడ్నీ సమస్యతో కోమాలో ఉన్న 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకి గురువారం మరణించారు. ‘‘స్థానికంగా కరోనా వ్యాపించకముందు నుంచే ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన కరోనా వల్లే మరణించారనడం సరికాదు’’ అని ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. గోవాలో మూడు కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారిలో 42 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 124 కేసులు, తర్వాత కేరళలో 118 కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా వైరస్‌ పరీక్ష కిట్‌ల కోసం భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కొటేషన్లు ఆహ్వానించింది. ఏడు లక్షల కిట్‌లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఎయిర్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా ఉన్న తన నోడల్‌ కేంద్రాల్లో తొమ్మిది క్వారంటైన్‌ కేంద్రాలను నెలకొల్పింది. 

ఒక్కోచోట 300 మందిని ఉంచవచ్చని తెలిపింది. నేవి, ఆర్మీ కూడా ముందుజాగ్రత్తగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. కరోనాను కట్టడి చేయడంలో సాయుధ బలగాలు, రక్షణ శాఖలోని వివిధ విభాగాలు పౌర అధికారులకు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశించారు. ఎఫ్‌సీఐ వద్ద ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో సవాళ్లు తలెత్తితే ఎదుర్కొనేందుకు ‘మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌’ ఉండాలని ఎయిమ్స్‌ నిర్ణయించింది. దీన్ని రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కరోనా బాధితులకు చికిత్సలో అవసరమయ్యే వెంటిలేటర్లను తయారుచేసి రూ.7,500కే అందించనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ప్రస్తుతం ఇతర కంపెనీల వెంటిలేటర్ల ఖరీదు రూ.5లక్షల నుంచి రూ10 లక్షల వరకు ఉందని తెలిపింది. అనుమతి లేకుండా మాంసం, జంతువుల విక్రయాలు సాగుతున్న మార్కెట్లను, జంతు వధశాలలను మూసివేయాలని పలు జంతు పరిరక్షణ సంస్థలు కేంద్రాన్ని కోరాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top