తెలంగాణ జైళ్ల శాఖ రికార్డ్

హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రికార్డ్ సృష్టించింది. వస్తువులను తయారుచేయడంలో తెలంగాణ ఖైదీలు దేశంలో మొదటిస్థానంలో నిలిచారు. 2019లో వారు తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం ద్వారా రూ.600 కోట్ల ఆదాయం జైళ్లశాఖకు వచ్చింది. దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ మొదటి స్థానంలో నిలించింది. మిగతా రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత తమిళనాడుకు రూ.73కోట్లు, మహరాష్ట్రకు రూ.29 కోట్లే రావడం గమనార్హం. తెలంగాణ జైళ్లలోని ఒక్కోఖైదీ దాదాపు రూ.9 లక్షల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసినట్లు ఎన్‌సీఆర్బీ తన నివేదికలో తెలిపింది. దేశంలోని మొత్తం ఉత్పత్తుల్లో 73శాతం తెలంగాణ నుంచే ఉన్నాయని పేర్కొంది. ఖైదీలు తయారు చేస్తున్న వివిధ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత కరోనా సమయంలో మాస్క్‌లు, శానిటైజర్లు ఖైదీలు తయారీ చేశారు. 

జైళ్లలో ఖైదీలు తయారు చేసిన వస్తువులకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ముసినిపల్‌ కార్యాలయాలు, లైబ్రరీ, ఆస్పత్రులు, విశ్వ విద్యాలయాల అధికారులు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారంటే ఆ వస్తువులకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దుప్పట్లు, అల్మారాలు, కంప్యూటర్‌ టేబుళ్లు, సబ్బులు, పినాయిల్‌ , చేనేత వస్తువులు, ఇంటి ముందు గేట్లు, అగర్‌బత్తీలు వంటి వస్తువుల నాణ్యతలో కార్పొరేట్‌ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఖైదీలు తయారు చేస్తున్నారు. 

ఖైదీలకు ఆసక్తి వున్న రంగాల్లో శిక్షణ ఇస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తూ జైలు అధికారులు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. జైలులోని పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తులను తయారు చేయిస్తూ వారిలో మనోస్థైర్యాన్ని నింపుతున్నారు. కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారుచేసిన వస్తువులకు లక్షల్లో ఆదాయం వస్తుందంటే వారు ఎంతగా కష్టపడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవిత కాలం శిక్ష అనుభవిస్తూ తమకు తెలిసిన వృత్తిలో కొనసాగుతూ జైళ్ల శాఖకు లక్షల్లో ఆదాయాన్ని సమకూర్చుతూ, కుటుంబ అవసరాలకు కొంత మొత్తాన్ని జైలులో సంపాదిస్తూ ముందుకు సాగుతున్నారు. జైలులో నెలకొల్పిన పరిశ్రమల్లో తయారు చేస్తున్న ఉత్పత్తులకు సంబంధించి మరింత మెరుగైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందివ్వాలేగాని కార్పొరేట్‌ ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా వస్తువుల తయారు చేసి జైళ్ల శాఖకు మరిన్ని లాభాలను అందించగలమని ఖైదీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top