టీ20 వరల్డ్‌కప్‌ 2022కు వాయిదా?

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ సందేహంగా మారింది. ఈ మెగా టోర్నీని ఏకంగా 2022కి మార్చితే ఎలా ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆలోచిస్తోంది. ఈనెల 28న జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఇదే విషయమై చర్చ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రయాణ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీని ఇప్పుడు జరపకపోవడం అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు కూడా మేలు చేస్తుందని బోర్డు సభ్యుడొకరు తెలిపాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాలి. ‘ఐసీసీ ఈవెంట్స్‌ కమిటీ నుంచి మాకు మూడు ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం నిర్వహిస్తే 14 రోజుల క్వారంటైన్‌ అమలు చేస్తూ ప్రేక్షకులను కూడా అనుమతించడం మొదటి ప్రతిపాదన. రెండోది ఖాళీ స్టేడియాల్లో టోర్నీని జరపడం. మూడోది 2022కి టోర్నీని మార్చడం’ అని బోర్డు సభ్యుడు తెలిపాడు. కానీ 16 జట్ల ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, టీవీ సిబ్బందికి క్వారంటైన్‌ ఖర్చులు భారీగా ఉంటాయని చెప్పాడు. మరోవైపు బంతిపై ఉమ్మి, చెమటకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై క్రికెట్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top