చేతిలో చిల్లిగవ్వలేక కువైత్‌లో కడపవాసుల అష్టకష్టాలు

రాజంపేట(కడప): కరోనా మహమ్మారి వల్ల కువైత్‌లో మన జిల్లావాసుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. కడప జిల్లాకు సంబంధించి సుమారు లక్ష మందికి పైబడి కువైత్‌లో ఉన్నారు. అక్కడ ఎన్నో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కువైత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఇంటిలో పనులు మినహా బయట పనులన్నింటినీ నిలిపివేశారు. దీంతో జిల్లాకు చెందిన 50వేలకు మందికి పైగా పనుల్లేక నెల రోజులుగా బంధువుల రూముల్లో తలదాచుకుంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అన్నానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. బయట ఎవరైనా కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వల్ల ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండటంతో అంతర్జాతీయ విమానాలన్నీ ఒకటిన్నర నెలగా నిలిచిపోయాయి.

30 వరకు గడువు

ఇకపోతే ఆ దేశంలో చట్టవ్యతిరేకంగా ఉన్నవారు, పాస్‌పోర్టులు, అకామా, ఇతరత్రా పత్రాలులేని వారికి కువైత్‌ దేశం క్షమాభిక్ష ప్రకటించింది. వారు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇండియాకు రావడానికి అనుమతులిచ్చింది. దీంతో మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చట్టవ్యతిరేకంగా ఉన్న 10వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. వారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. పనులులేక పస్తులుంటున్న వారు, చట్టవ్యతిరేకంగా ఉంటున్న వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కువైత్‌లో కష్టాలు పడుతున్న తమవారి రాకకోసం భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.

ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత

ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ మేడపాటి వెంకటేష్‌ కడప జిల్లాకు చెందిన ఏపీఎన్‌ఆర్‌టీ డైరెక్టర్‌ ఇలియాస్‌, కడప జిల్లా ప్రవాసాంధ్రుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ముమ్మడి బాలిరెడ్డి, ఎం.వి.నరసారెడ్డి తదితరులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించి మనవారి దరఖాస్తులు నింపుతున్నారు. తిండికి కూడా లేనివారికి ఏపీఎన్‌ఆర్‌టీ, తెలుగు సంక్షేమ సంఘం తరపున సహాయపడుతున్నారు. కువైత్‌ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ ఆ దేశంలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ లేనివారిని మాత్రమే పంపించే అవకాశముంది. ఈ సమయంలో మన విదేశాంగశాఖ వీరిని రావడానికి ఏ మాత్రం అనుమతిస్తుందో తెలియరావడం లేదు.

అన్నానికి కూడా ఇబ్బంది పడుతున్నాం..

ఒకటిన్నర నెలగా పనులు లేక రూమ్‌లో ఉన్నా. మన జిల్లాకు సంబంధించిన వారే 50వేల మంది పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. వారి వద్ద పైసా డబ్బులేదు. మనోళ్లు విమానాలు ఏర్పాటు చేస్తే లాక్‌డౌన్‌ తరువాత వెంటనే రావడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. దయవుంచి మన ప్రభుత్వం కువైత్‌ దేశంతో సంప్రదించి మన వారందరినీ ఇండియాకు రప్పించుకోవాలి.

– పాటూరు సుబ్బరామిరెడ్డి, కువైత్‌ నుంచి కడప జిల్లా ప్రవాసాంధ్ర సభ్యుడు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top