కారులో మంటలు..అమెరికాలో దేవరకొండవాసి మృతి

అమెరికాలో స్థిరపడిన నల్లగొండ జిల్లా వాసి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అక్కడ టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిఽధిగా కొనసాగుతున్న నలమాద దేవేందర్‌ రెడ్డి (44) ఓ ప్రమాదంలో మృతిచెందారు. ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు కారును స్టార్ట్‌ చేయగా ఒకేసారి మంటలు చెలరేగాయి. కారు డోర్లకు లాక్‌ పడటంతో బయటకు వచ్చేందుకు వీలుకాలేదు. కారు డోర్లు, అద్దాలను స్థానికులు పగులగొట్టి బయటికి తీసేలోపే ఆయన మృతిచెందారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికా పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు మృతుడి సోదరుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. దేవేందర్‌ స్వస్థలం.. దేవరకొండ మండలం కర్నాటిపల్లి. ఉన్నత చదువుల తర్వాత 1998లో అమెరికా వెళ్లిన ఆయన, న్యూజెర్సీలోని ఎడిసన్‌లో స్థిరపడ్డారు. ఐటీఎల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. 2006లో హైదరాబాద్‌కు చెందిన అనురాధతో ఆయనకు వివాహమైంది.

ఈ దంపతులకు కూతురు చెర్రీ ఉంది. దేవేందర్‌రెడ్డి తండ్రి నర్సిరెడ్డి ఆర్టీసీ ఉద్యోగి. పదేళ్ల క్రితం మృతిచెందారు. తల్లి భారతమ్మ, దేవరకొండలో నివాసం ఉంటున్నారు. కుమారుడి మరణవార్త తెలిసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు.  కాగా తమతో దేవేందర్‌రెడ్డి చివరిసారిగా 10 రోజుల క్రితం ఫోన్లో మాట్లాడారని సోదరుడు రవీందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దేవేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ స్నేహితులు. 2017లో అమెరికా పర్యటనలో దేవందర్‌రెడ్డితో కలిసి గడిపిన రోజులను రవీంద్ర కుమార్‌ గుర్తుచేసుకున్నారు. లాక్‌డౌన్‌ రోజుల్లో ఎన్‌ఆర్‌ఐలతో అమెరికాలో సమావేశం ఏర్పాటుచేసి దేవరకొండ ప్రాంతంలోని ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు, దేవేందర్‌రెడ్డి నగదును పంపించినట్లు ఆయన మిత్రుడు నారాయణరెడ్డి తెలిపారు. దేవేందర్‌రెడ్డి మృతితో దేవరకొండ, కర్నాటిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top