ఎల్లుండి నుంచి అసెంబ్లీ పెట్టాల్సిందేరాజస్థాన్‌ సర్కార్‌ మళ్లీ అదే డిమాండ్

ఎజెండాలో కనిపించని విశ్వాస పరీక్ష

 అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రాజస్థాన్‌లో రాజకీయం ముదురుతోంది. గెహ్లోత్‌ సర్కారు తన డిమాండ్‌కే కట్టుబడింది. సమావేశాలు నిర్వహించాలంటే 21 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా స్పష్టం చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 31వ తేదీ నుంచే సమావేశాలు జరపాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. సీఎం అశోక్‌ గెహ్లోత్‌ అధ్యక్షతన రాజస్థాన్‌ మంత్రివర్గం మంగళవారం మరోసారి సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్‌ మిశ్రా ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. సమావేశాల నిర్వహణకు అభ్యంతరం లేదంటూనే మూడు షరతులు విధించారు. సమావేశాల నిర్వహణకు 21 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, విశ్వాస పరీక్ష నిర్వహిస్తే ప్రత్యక్ష ప్రసారం చేయాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. సవరించిన ప్రతిపాదనను తనకు పంపాలని కోరారు. విశ్వాస పరీక్ష చేపడతామంటూ సవరించిన ప్రతిపాదనలో పేర్కొంటే కనక.. స్వల్పకాల నోటీసు ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. గవర్నర్‌ అభ్యంతరాలపై కేబినెట్‌ మంగళవారం చర్చించింది. అనంతరం, సవరించిన ప్రతిపాదనను మరోసారి గవర్నర్‌కు పంపింది. సచిన్‌ పైలట్‌ వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ గెహ్లోత్‌ మంత్రివర్గం కేబినెట్‌ నోట్‌ పంపించడం ఇది మూడోసారి.

విశ్వాస పరీక్షపై అందులో ఏమాత్రం ప్రస్తావించలేదు. కానీ, 31వ తేదీ నుంచి సమావేశాలు జరపాలని పునరుద్ఘాటించింది. కేబినెట్‌ సమావేశం తర్వాత రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సింగ్‌ కచారియా విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌తో ఘర్షణను కోరుకోవడం లేదని కనీసం ఇప్పుడైనా అంగీకరిస్తారని భావిస్తున్నామని అన్నారు. సమావేశ ఎజెండా ఏమిటని ప్రశ్నించగా.. ఆ సంగతి బీఏసీ చూసుకుంటుందన్నారు. సమావేశాల నిర్వహణకు 21 రోజుల నోటీసు అక్కర్లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ తాము కోరి ఇప్పటికే పది రోజులు గడిచిందని, తేదీని గవర్నర్‌ ఎందుకు నిర్ణయించడం లేదని ప్రశ్నించారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌స్‌లో చేర్చుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ మరోసారి హైకోర్టు తలుపు తట్టారు.   మరోవైపు  బీఎస్పీ కూడా బుధవారం హైకోర్టును ఆశ్రయించనుంది. ఇదిలా ఉండగా… అశోక్‌ గెహ్లాత్‌ సోదరుడికి మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top