ఆ 2 బిల్లులు ఆమోదించొద్దంటూ గవర్నర్‌కు కన్నా లేఖ

అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం పంపిన క్యాపిటల్ బిల్లులకు మీరు అంగీకారం తెలపవద్దని విజ్ఞప్తి. రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం, 2014ను రాష్ట్ర ప్రభుత్వం  రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. వాస్తవ పరిస్థితిని మీకు వివరించేందుకే ఈ లేఖ రాశాను. రెండు బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపగా అది పెండింగ్‌లో ఉంది. వికేంద్రీకరణపై బిల్లు, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014కు వ్యతిరేకంగా ఉంది. అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అమరావతి బాండ్ల అమ్మకం ద్వారా గత ప్రభుత్వం రూ.2,000 కోట్లు సమీకరించింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం కూడా ఆర్థిక సహాయం అందించింది. అమరావతి ప్రాంతంలో ఒకే రాజధాని మాత్రమే ఉంటుందని ఒప్పందంపై రైతులు 32,000 ఎకరాల సారవంతమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి త్యాగం చేశారు. రాజధాని ప్రాంత రైతుల నిరంతర శాంతియుత, ప్రజాస్వామ్య ఆందోళనను పరిశీలించాలని మిమ్మల్ని కోరుతున్నాను. రాజధాని వికేంద్రీకరించడానికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. అభివృద్ధికి సహకరించిన వాటాదారులందరికీ ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడం లేదు. ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం పంపిన వికేంద్రీకరణ  బిల్లులకు అనుమతి ఇవ్వవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను.’’ అంటూ గవర్నర్‌కు పంపిన లేఖలో కన్నా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top