అమ్మో.. మీకు అప్పివ్వం!

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరార్‌!!..

నీటి ప్రాజెక్టులకు రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నం

చేతిలో పైసా లేకున్నా పలు నీటి ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం శంకుస్థాపనలు చేసేస్తోంది. ప్రాజెక్టుల ప్రణాళికల రూపకల్పనలో చూపిస్తున్న జోరు.. నిధుల విడుదలపై మాత్రం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. ప్రత్యేక కార్పొరేషన్ల పేరిట నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నా.. అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో కాంట్రాక్టు సంస్థలే రుణాలు ఇప్పించే పనిలో పడినట్లు తెలుస్తోంది.

నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్లు

అప్పులు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలు ససేమిరా!

కమీషన్లు ఇవ్వజూపుతున్నా విముఖత?

పైసా లేకున్నా ఎడాపెడా పునాది రాళ్లు

జల వనరుల శాఖలో ఆందోళన

స్వయంగా బరిలోకి కాంట్రాక్టు సంస్థలు

రుణాల కోసం ఆర్థిక సంస్థలతో మంతనాలు?

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం జోరుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎడాపెడా పథకాలను ప్రకటించి శంకుస్థాపనలు చేసేస్తోంది. కానీ నిధుల కొరత తీవ్రంగా ఉంది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.13,095.74 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కానీ ఈ శాఖ ఏకంగా రూ.లక్ష కోట్లకు పైబడిన వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం వద్ద నిధులు అంతంతమాత్రమే. దీంతో అప్పులు తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ రుణాలిస్తామని ఒక్క బ్యాంకు గానీ, ఆర్థిక సంస్థ గానీ ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో ఏడాదిలోగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నిర్మాణాలు జోరుగా చేపట్టాలంటే.. రూ.1,078 కోట్లను తక్షణమే విడుదల చేయాల్సి ఉంది.

అదేవిధంగా ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.15,433 కోట్లు అవసరం. ద్వితీయ ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ.1,105 కోట్లు, తర్వాతి ప్రాధాన్య ప్రాజెక్టుకు రూ.4,157 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రూ.3,778 కోట్లు కావాలి. వెరసి .. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.24443 కోట్లకు అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా సర్కారు కొత్తగా మరికొన్ని ప్రాజెక్టులకు కార్యాచరణను సిద్ధం చేసింది.

వాటిలో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం అత్యంత కీలకమైనది. ఈ పథకానికి రూ.39,980 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.8,400 కోట్లు, రాష్ట్ర జల భద్రతా పథకానికి రూ.12,702 కోట్లు, పల్నాడు దుర్భిక్ష నివారణ పథకానికి రూ.7,633 కోట్లు, కృష్ణా కొల్లేరు నీటి శుద్ధి పథకానికి రూ.3,356 కోట్లు.. వెరసి రూ.72,071 కోట్లు ఖర్చుచేయాలి.

మొత్తంగా చూస్తే.. రూ.96,514 కోట్లు కావాలి. వీటికితోడు ఇటీవల కడపలో పలు రిజర్వాయర్ల నిర్మాణం.. కాలువల అభివృద్ధి పనుల కోసం రూ.8,000 కోట్ల వరకూ అంచనాలతో ప్రభుత్వం పాలనానుమతులు మంజూరు చేసింది. రాజధాని నగరానికి నీరందించేందుకు చేపట్టే వేదాద్రి ప్రాజెక్టుకు రూ.500 కోట్ల వరకూ ఖర్చవుతాయి. 

అప్పు పుడుతుందా?

ఇంత భారీ స్థాయిలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రుణ సమీకరణకు మాత్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సమాయత్తమైంది.

అయితే జగన్‌ ప్రభుత్వ వ్యవహార శైలి, ట్రాక్‌ రికార్డు చూశాక బ్యాంకులు, ఆర్థిక సంస్థలేవీ ముందుకు రావడం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. చివరకు కమీషన్లు చెల్లించేందుకు సిద్ధమైనా అప్పు పుట్టడం లేదన్న ప్రచారమూ సాగుతోంది. ఇక లాభం లేదని కాంట్రాక్టు సంస్థలనే రంగంలోకి దింపినట్లు సమాచారం.

కొన్ని కంపెనీలు నేరుగా ఆర్థిక సంస్థలతో మాట్లాడి అప్పు ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని వార్తలు వస్తున్నాయి. ముంబై, ఢిల్లీల్లోని ఆయా బ్యాంకులు/ఆర్థిక సంస్థల ప్రధాన కార్యాలయాలకు  వెళ్లి.. ప్రాజెక్టుల డీపీఆర్‌లను చూపించి.. రుణం కోసం జలవనరుల శాఖతో దగ్గరుండి మరీ దరఖాస్తులు చేయిస్తున్నాయన్న ప్రచారం కూడా నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top